Dec 17, 2010

"నాహం కర్త : హరి కర్త:"

కొత్త పుస్తకం అంటే ఇష్టపడకుండా ఉండని పాఠకులలో నేను కూడా ఒకణ్ణి . అలాగని ప్రతి క్రొత్త పుస్తకం చదివే అలవాటు కూడా లేదు, కాని క్రొత్తగా కనిపించిన వాటిలో చాలా వాటిని చదువుతాను.

పుస్తక పఠనం ఎప్పుడు అలవాటుగా మారిందో నాకు తెలియదు కాని, ఆ అలవాటు మాత్రం మా అన్నయ్య దగ్గరనుండి వచ్చింది. ఇప్పుడు నేను వ్రాయబోయే అంశం చాలాకాలం క్రితం చదివిన ఇప్పటికి, ఎప్పటికి, క్రొత్త ఆనందాన్ని, ఆహ్లాదాన్ని, ముఖ్యంగా ఆధ్యాత్మికతను అందించిన P.V.R.K. ప్రసాద్ గారి

"నాహం కర్త: హరి కర్త:"

ఎప్పుడు తిరుపతి వెళ్ళి రావటమే తప్ప, యాత్ర అనుభవాల గురించి గాని, యాత్ర విశిష్టత గురించి గాని, అక్కడి వ్యవస్థల గురించి గాని ఎప్పుడూ కూడా ఆలోచించలేదు. కాని ప్రసాద్ గారి హయాంలో జరిగిన సంఘటనలు, వాటిని ఆయన ఎదుర్కొన్న (స్వామి ఆయనను నడిపించిన) తీరు చదువుతున్నంతసేపు, చదివిన తరువాత కూడా నా రోమాలు తమ సహజ స్థితికి రావటానికి చాలాసేపు పట్టింది అన్నది మాత్రం నిజం.

నేను ఈ పుస్తకం చదివిన (స్వామి నన్ను చదివించిన) తీరు నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఈ పుస్తకం లో నేను మొదట చదివిన అంశం "గోగర్భం డ్యాం". మహా వేదపండితులు "బ్రహ్మశ్రీ" ఉప్పులూరి గణపతి శాస్త్రి గారి నేతృత్వంలో, ప్రసాద్ గారు ఎంతో నమ్మకంతో చేయించిన (స్వామి తన ఉనికిని నాలాంటి అజ్ఞానులకు చూపటానికి) వరుణయాగ విశేషాలు చదువుతుంటే నిజంగా ఒడలు జలదరించి పులకరించింది. ఆనాటినుండి ప్రారంభించి మొత్తం 6 రోజులలో ఆ పుస్తకం చదవడం పూర్తి చేసాను. నాటి నుండి నేటి వరకు ఎన్నెన్నో అంశాలు, పరిస్థితులు, స్మ్రుతులు ఆ పుస్తకాన్ని మరల మరల చదివే అవకాశం నాకు కల్పిస్తున్నాయి.

ముఖ్యంగా కాలిబాట లో నిర్మాణం, రాత్రిపూట స్వామి వారి ఆలయంలో గంటలు మ్రోగటం, ప్రసాద్ గారి కుమార్తె వివాహం, ఆలయంలో మిరాశీ విధానం మార్చటంలో వారి అనుభవాలు, స్వామి వారి తిరునామం విషయంలో సందిగ్దత, స్వామివారి శుక్రవార అభిషేక అనుభవాలు ... ఇలా ఎన్నో, ఎన్నెన్నో నా మనసుకు చాలా హత్తుకునే విధంగా వ్రాసిన ప్రసాద్ గారి రచనా నైపుణ్యానికి, ఆ విధంగా వారిచే వ్రాయించిన స్వామివారి కృపాకటాక్షవీక్షణాలకు శిరసువంచి నమస్కరిస్తున్నాను.

No comments:

Post a Comment